3, మార్చి 2017, శుక్రవారం

వైఎస్ గురించి గద్దర్ ఏమన్నాడో తెలుసా ?

వైఎస్సార్‌ది ఒక ప్రత్యేకత. ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలో ఉంటూ కడపకు పోయి పులివెందుల ప్రాంతంలో వైఎస్‌ తండ్రి రాజారెడ్డిపై పాటలు గట్టి ప్రచారం చేస్తున్నప్పుడు మాకు వ్యతిరేకంగా పాటలు పాడతావా అని నా చేతులు కట్టేసి పట్టుకుపోయారు. ఎవరు నువ్వు అని ఇడిగితే ఇంజనీరింగ్‌ చదివినా, ప్రజలను ఆర్గనైజ్‌ చేస్తా అన్నాను. కడపలో నువ్వేం ఆర్గనైజ్‌ చేస్తావురా బాబు అన్నాడు రాజారెడ్డి. ఈలోపు వైఎస్సార్‌కి తెలిసింది. 
వెంటనే తనవద్దకు రప్పించుకున్నాడు. తాగేందుకు చాయ్‌ ఇచ్చాడు. బాగున్నావా అనడిగాడు. చాలా ఇష్టపడ్డాడు. అది పాత మాట.
 కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక ఉత్తరువు తెచ్చాడు. గద్దర్‌ ప్రజల గాయకుడు. పేదల కష్టాల గురించి పాటలు రాస్తాడు. ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆయన భార్య వచ్చి కలిసి మాట్లాడింది. 
గద్దర్‌ ఒక మాన్యుమెంట్‌ లాంటివాడు. ఆయన్ని మనం కాపాడుకోవాలి అన్నారు వైఎస్‌ఆర్‌. ఆ మాట చాలు కదా. అప్పుడే నాకు రక్షణ వచ్చింది. మిగతా ఎవరి పాలనలోనూ నాకు రక్షణ ఇవ్వ లేదు. అసెంబ్లీలో వైఎస్సార్‌ నాగురించి కొట్లాడిన తర్వాతే నాకు రక్షణ వచ్చింది. ముఖ్యమంత్రి అయ్యాక కూడా అనేకసార్లు కలిశాను. అక్కడ సూరీడు చాయ్‌ ఇవ్వబోతే ‘నువ్వివ్వకు లక్షలాది మంది ప్రజలను కదిలించినవాడు. నేనే ఇస్తాను’ అని వైఎస్‌ స్వయంగా నాకు టీ ఇచ్చారు. నా పాట లంటే ఆయనకి చాలా ఇష్టం. ‘రక్తమిచ్చినా రాయలసీమకు ఏమిస్తవురో రామన్నా..’ ఈ పాట చాలా ఇష్టం ఆయనకు. పదే పదే పాడించుకునేవారు. 
ఒకసారి పోలీసులు ఎవరినో పట్టుకున్నారు.. కాల్చేసే ప్రమాదముందని నేను క్యాంప్‌ ఆఫీసుకు గోసీ గొంగడేసుకుని వెళితే ఏంటని అడిగారు. మీ పోలీసులు ఎవరినో పట్టుకున్నారట. కాల్చేస్తారట, మీరు కాస్త చూడాలి అంటే అలా చేయవద్దంటూ అప్పటికప్పుడే సంబంధిత వ్యక్తులకు ఆదేశా లిచ్చారు. 
ఎన్టీరామారావును, చంద్రబాబునాయుడిని కూడా చాలాసార్లు కలిసాను. 
కానీ వీరందరిలో వైఎస్‌ఆర్‌ది ఒక ప్రత్యేకత.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి